‘ఆర్.రమాదేవి తన కంఫర్ట్ డిక్షన్ లో రాసిన
కవిత ఇది.అదే నిరీక్షణ.అదే పిలుపు.అదే సఖు
డు..అదే విరహం..అదే ప్రేమ..అదే అనుభూతి..
ఆవైనమేంటో ఈరోజు కాఫీ టైమ్లో చూద్దాం రండి!!
“Hello…(హలో…)
ఆవైపు నుండి అకాల వర్షంలా
ఎలా ఉన్నావంటూ వినవచ్చిందో మాట...
ఇప్పటివరకు
ఎలా ఉన్నానో ఎందుకు కాని
నీ మాట వినబడగానే
అడవిలోని కుందేలు పిల్లనయ్యాను
తెలియనితనం సంచి నిండుగా
నింపుకున్నాను
కాసేపు
ఎగిరే తెలివిలేని పక్షి నయ్యాను
స్వేచ్ఛ అంటే ఏంటో మర్చిపోయాను
మనసంతా
ఇంద్రధనస్సును మించిన రంగులతో
నిండిపోయింది
ఇక
తెలియనితనంతో
బందీగా నీ వాకిట నిలవాలనిపించింది
ఓయ్.. రాకుమారా!
అడిగింది చాల్లే
ఎలా ఉన్నానో కూడా చెప్పు మరి”!!
*ఆర్..రమాదేవి..!!
అతడున్నాడా? వుంటే ఎలావుంటాడు? ఎక్కడుం
టాడు? ఏం చేస్తుంటాడు.అతగాడి కథా కమామీషు ఏమిటి?
నిజానికి అతగాడు ఆమె ‘భావనా లోకంలోని సఖు
డు.అతగాడు ఆమె రాజకుమారుడు.అతగాడి ఆను
పానులు ఆమెకు మాత్రమే తెలుసు..సో..ఆమె దృష్టి
కోణం నుంచే ఈకవితను చూద్దాం!
Hello…(హలో…)
అతగాడి పిలుపు…
ఆ పిలుపు మధురంగా ఆమె చెవిన పడింది.చాన్నా
ళ్ళు నిరీక్షణ తర్వాత అతగాడి పిలుపువినిపించింది.
“ఎలా ఉన్నావంటూ” అకాల వర్షంలా. వినవచ్చిందా మాట…
ఇకనేం…
ఇప్పటివరకు ఆమె ఎలా ఉందో కానీ,అతగాడిమాట
వినబడగానే అడవిలో గెంతేకుందేలు.పిల్లైపోయింది.
తెలియనితనం సంచి నిండుగానింపుకుంది.కాసేపు ఎగిరే తెలివిలేని పక్షైంది..స్వేచ్ఛ అంటే ఏంటో మర్చి
పోయి,ఆ పిలుపుకు బానిసైపోయింది…
ఇక చూడాలి ఆమె పరిస్థితి…
మనసంతా ఇంద్రధనస్సును మించిన రంగులతో
నిండిపోయింది..ఇక తెలియని తనంతో బందీగా
అతగాడి వాకిట నిలవాలనిపించిందామెకు...
ఓయ్.. రాకుమారా !
“అడిగింది చాల్లే…
ఎలా ఉన్నానో కూడా చెప్పు మరి”అంటోందామె..!
అతగాడి పిలుపు మాత్రమేకాదు. చూపు కూడా
గుచ్చుకోవాలామెకు.అప్పుడే ..ఆమె నిరీక్షణ….
ఫలవంతమవుతుంది..!!
*ఎ.రజాహుస్సేన్..!!